Actresses : వృత్తి సంపద కోసం.. ప్రవృత్తి సంతృప్తి కోసం.. నటనను వృత్తిగా ఎంచుకున్నవాళ్లకు అందులోనే సంతృప్తి! అంతకుమించి సాధించాలన్న తపన కొందరిని ఊరికే ఉండనివ్వదు. అందుకే సినీతారలు వ్యాపారవేత్తలుగా అవతారం ఎత్తుతున్నారు. ఆర్థిక భద్రత కోసం కొందరు, తమ సృజనాత్మకతను ఆవిష్కరించడానికి ఇంకొందరు.. కారణం ఏదైతేనేం.. ఆంత్రప్రెన్యూర్లుగా సెటిలవుతున్నారు పలువురు కథానాయికలు.
Actresses : సెలెబ్రిటీలు, వారి కుటుంబాల వ్యక్తిగత విశేషాల గురించిన వార్తలకు ఉండే ఆదరణే వేరు. వెండితెరపై అందం, అభినయం ప్రదర్శించడం ద్వారా అభిమాన‘ధనాన్ని’ సంపాదించుకున్న నటీమణులెందరో! అలా కూడబెట్టిన సొమ్ము రెట్టింపు చేసుకునేందుకో, ఆర్థిక భద్రత కోసమో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సినీ తారలు, వారి కుటుంబసభ్యులు చాలామందే ఉన్నారు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా రాణిస్తూనే బిజినెస్‌లోనూ అడుగుపెట్టి.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినీ పరిశ్రమను ‘చిరు’నామాగా మలుచుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ లేడీస్ సైతం తాజాగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని కొణిదెలవారి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
నువ్వేం మాయ చేస్తావో.. భూమిక
‘ప్రేమకథ’ చిత్రంతో పరిచయమై ‘ఒక్కడి’తో ‘నువ్వేం మాయ చేశావో..’ అనిపించుకున్న నటి భూమిక. కథానాయికగా సక్సెస్ అయిన ఈ నటి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నది. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే… వ్యాపారవేత్తగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. గత జనవరిలో రెస్టారెంట్ బిజినెస్‌లోకి ప్రవేశించింది. మన దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో వెల్నెస్ హోటల్‌ను ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. ‘గోవాలో మా సరికొత్త వెంచర్ ‘సమర వెల్నెస్ హోటల్”.. అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు చాలామంది రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగుపెట్టారు. వీరందరికీ భిన్నంగా భూమిక వెల్నెస్ హోటల్‌ను ప్రారంభించింది. స్పాతోపాటు మ్యూజిక్, డ్యాన్స్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దింది. గోవాకు వెళ్లినప్పుడు ఈ కథానాయిక వెల్నెస్ సెంటర్‌ను మీరూ సందర్శించండి!
ఫ్యాషన్ లేబుల్.. సమంత
అందానికి మించిన అభినయంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది సమంత. కొత్తదనానికి కేరాఫ్‌గా ఉండే ఆమె ఎక్కడికి వెళ్లినా అందరి కండ్లూ ఆమె ధరించిన ఆభరణాలపైనే ఉంటాయి. సమంత ఫ్యాషన్ టేస్ట్ అలా ఉంటుంది మరి! అందుకే, సొంతంగా ‘సాకీ’ పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించింది. ఇందులో మోడ్రన్ ఇండియన్ బ్రాండెడ్ కలెక్షన్లు అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు ‘ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్’ పేరుతో కొన్ని విద్యాసంస్థలూ నిర్వహిస్తున్నదీ స్టార్ బిజినెస్ ఉమెన్. కొన్నాళ్ల కిందట ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సినీ నిర్మాణ సంస్థను సైతం స్థాపించింది.

స్కిన్ కేర్ బ్రాండ్… కీర్తి సురేశ్
మహానటి సావిత్రి జీవిత గాథతో తెరకెక్కిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ తరం సహజ నటి కీర్తి సురేశ్. సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యాపారిగా అవతారమెత్తింది. ఓ స్కిన్ కేర్ బ్రాండ్‌ను స్థాపించింది. ‘భూమిత్ర’ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీ ప్రకృతి ప్రసిద్ధమైన ఔషధాలతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తులను అందిస్తున్నది.

గోల్డెన్ థ్రెషోల్డ్.. తమన్నా
మిలమిల మెరిసే పాలపుంతలాంటి అందం తమన్నా సొంతం. ధగధగ మెరిసే ఆభరణాలంటే ఈ అమ్మడికి ఎంతో ఇష్టం. అందుకే కాబోలు బంగారు ఆభరణాల వ్యాపారాన్ని ఎంచుకుందీ మిల్కీ బ్యూటీ. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే పెద్ద హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేసింది. స్టార్ హీరోయిన్గా దశాబ్దానికిపైగా వెలుగు వెలిగింది. ఇప్పటికీ రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నది. సినిమాల్లో కాల్షీట్లు సర్దుబాటు చేయనంత బిజీగా ఉన్నప్పుడే 2015లో ‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ ఆన్లైన్ బిజినెస్ మూడు డైమండ్లు.. ఆరు నెక్లెస్లుగా కొనసాగుతున్నది.

ఫిట్నెస్ కింగ్.. రకుల్ ప్రీత్ సింగ్
కొత్త పెండ్లికూతురు రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పగానే ఆమె అభిమానులకు ఫిట్నెస్ గుర్తుకొస్తుంది. ఔను! ఫిట్నెస్ విషయంలో కచ్చితంగా ఉండే ఈ సుందరి తనకు ఇష్టమైన ఫీల్డ్నే బిజినెస్‌కు ఎంచుకుంది. ‘ఎఫ్45’ పేరుతో ఫిట్నెస్ హెల్త్ హబ్, జిమ్ ప్రారంభించింది. ‘ఎఫ్45’ ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ. ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రకుల్ మూడు శాఖలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేటతోపాటు విశాఖలో ‘ఎఫ్45’ కేంద్రాలున్నాయి. ఈ బిజినెస్‌లో రకుల్ సోదరుడు అమన్ కూడా భాగస్వామి.

మెగా పార్ట్నర్ అత్తమ్మాస్ కిచెన్
- అట్టు వేయడంలో మెగాస్టార్ చిరంజీవి రూటే
సెపరేటు. ఆయన జీవితాన్ని పంచుకున్న సురేఖ ఇప్పుడు తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమైంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 18న ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్లైన్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మెగా కోడలు రామ్‌చరణ్ భార్య ఉపాసన ఈ వ్యాపారంలో కీలక భూమిక పోషిస్తున్నది. ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి సౌత్ ఇండియా స్పెషల్ వెరైటీలను రెడీమిక్స్ రూపంలో అందించనున్నారు. ఇంటి వంట రుచిని అందించేలా వీటిని ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్నది ఉపాసన. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మెగా కాంపౌండ్ నుంచి మనకు కావాల్సిన రుచులు పొందొచ్చన్నమాట. ఇప్పటికైతే ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ వంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ.1099గా నిర్ణయించారు.

హోమ్ డెకర్ లేబుల్..కాజల్
టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి ‘మర్సాలా’ అనే జువెలరీ బ్రాండ్‌ను స్థాపించింది. భర్త గౌతమ్ కిచ్లూ సహకారంతో ‘కిచడ్’ పేరుతో ఓ హోమ్ డెకర్ లేబుల్ నిర్వహిస్తున్నది. ఇక్కడ సోఫాలు, కుషన్లు విక్రయిస్తారు.
హవా ఉన్నప్పుడే..
గాలి ఉన్నప్పుడే వడ్లు తూర్పారబట్టాలి అని సామెత. ఈ మాటలనే ఫాలో అవుతున్నారు పలువురు హీరోయిన్లు. కర్లీ హేర్ పాప తాప్సీ తన చెల్లెలు శగున్, స్నేహితురాలు ఫరా పర్వేషన్తో కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ‘ద వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో స్థాపించిన ఈ వేదిక ద్వారా ఒక్కటైన సెలెబ్రిటీలు చాలామందే ఉన్నారు. ఇలియానా గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు నడుపుతున్నది. ప్రణీతకు బెంగళూరులో రెస్టారెంట్ ఉంది. శ్రియా శరణ్ ‘శ్రీ స్పందన’ పేరుతో బ్యూటీ సెలూన్, స్పా నిర్వహిస్తున్నది.
also read-Neha Shetty : టాలీవుడ్‌పై కేంద్రీకృతమైన అందాల తుఫాను.. నేహా శెట్టి…!