Elon Musk Demand To Remove Brazil SC Judge : బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డీ మోరేస్ తన వెంటనే రాజీనామా చేయాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను అభిశంసించాలని పిలుపునిచ్చారు. దుష్ప్రచారం నెపంతో ఖాతాలను బ్లాక్ చేసేందుకు ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఆయన ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారన్నారు.
న్యాయమూర్తిపై మస్క్ ఘాటు విమర్శలు!
న్యాయమూర్తి మోరేస్‌పై ఎలాన్ మస్క్ శనివారం సాయంత్రం నుంచి తన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ‘ఎక్స్’ను పూర్తిగా నిషేధిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో బ్రెజిల్ నుంచి వచ్చే ఆదాయం మొత్తంపోతుందని, ఫలితంగా అక్కడ కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని అన్నారు. అయినప్పటికీ తాము చింతించడం లేదని చెప్పారు. లాభాల కంటే తమకు సిద్ధాంతాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. బ్రెజిల్లో వాక్ స్వాతంత్ర్యంపై మోరేస్ విరుచుకుపడుతున్నారని మస్క్ సహా మరికొంతమంది ఆరోపించారు.
మస్క్‌పై ప్రత్యేక న్యాయవిచారణ!
Justice Investigation On Elon Musk : ఎక్స్ అధినేతఎలాన్ మస్క్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలను బ్రెజిల్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. తప్పుడు సమాచార వ్యాప్తిపై జరుగుతున్న విచారణలో మస్క్‌ను కూడా చేర్చారు. కోర్టు కార్యకలాపాలకు అడ్డు పడుతున్నారని, తీర్పులకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అందుకు ఎక్స్‌ను ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు. తద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న కొంతమంది వ్యక్తులకు మస్క్ మద్దతుగా నిలుస్తున్నారని న్యాయమూర్తి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రత్యేకంగా న్యాయ విచారణ చేపట్టాలని న్యాయమూర్తి అలెగ్జాండర్ డీ మోరేస్ నిర్ణయించారు.
చాలామంది మాజీ అధ్యక్షుడి మద్దతుదారులే
బ్రెజిల్ న్యాయమూర్తి మోరేస్ ఇటీవల పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించారు. వీరిలో చాలామంది బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు కావడం గమనార్హం. అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయడానికి బోల్సోనారో అనర్హుడంటూ 2023లో మోరేస్ నేతృత్వంలోని ఎలక్టోరల్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది.
ALSO READ-Best Selling Cars : అమ్మకాల్లో దుమ్ములేపుతున్న కార్లు ఇవే.. ఎగబడి కొనేసిన జనాలు..!
also read-Tata Punch Vs Tata Punch Ev : టాటా కార్లు కొనేవారు ఈ రెండింటి తేడాలు తప్పకుండా తెలుసుకోండి..!