Saif Ali Khan Attack : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలోని హీరానందానీ ఎస్టేట్ సమీపంలో ఉన్న లేబర్ క్యాంపులో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.లేబర్ క్యాంప్‌లోని చెట్ల పొదల్లో దాక్కున్న నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
Saif Ali Khan Attack : ‘‘ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశాం. అతడి పేరు మొహమ్మద్ ఇస్లామ్ షెహజద్. వయసు 30 ఏళ్లు. దొంగతనం చేసేందుకు అతడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతాం. అతడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతాం. అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తేమోననే అనుమానం ఉంది. అతని వద్ద సరైన పత్రాలు లేవు’’ అని ముంబయి జోన్ 9 డీసీపీ దీక్షిత్ చెప్పారు.
దొరికిపోతాననే భయంతో నిందితుడు మొదట తన పేరు ‘విజయ్ దాస్’ అని చెప్పాడని పోలీసులు చెప్పారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది తానేనని అతడు అంగీకరించాడని ముంబయి పోలీసులు చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.నిందితుడు థానేలోని ‘రికీస్ బార్’లో హౌస్‌కీపర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.విచారణ కోసం నిందితుడిని తెల్లవారుజామున 3.30 గంటలకు బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు బాంద్రా హాలిడే కోర్టులో హాజరుపరచనున్నారు.
20 పోలీసు బృందాలతో గాలించి..
గురువారం (జనవరి 16) తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ వ్యక్తిచొరబడి, కత్తితో దాడి చేశాడని పోలీసులు ప్రాథమికంగా చెప్పారు.
ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు.
ముంబయిలోని పలు ప్రాంతాల నుంచి 15 మందికి పైగా అనుమానితులను బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన నిందితుడి ఫోటోను చూపించి అనుమానితులను ప్రశ్నించారు.
ఇతర ప్రాంతాల్లోనూ మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
సైఫ్ అలీఖాన్ నివాస భవనంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో పోలీసులకు అనేక ఆధారాలు లభించాయని, తొందరలోనే నిందితుడిని పట్టుకుంటారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
చివరికి, థానేలోని లేబర్ క్యాంపులో అసలు నిందితుడు ఉన్నాడని గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

సైఫ్ ఎలా ఉన్నారు?
సైఫ్ అలీ ఖాన్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన శరీరంపై 6 కత్తి గాట్లు పడ్డాయని, అందులో రెండు లోతుగా దిగాయని, దాదాపు 5 గంటలపాటు శస్త్రచికిత్స జరిగిందని మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు.
సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తులు నివాసం ఉండే ముంబయిలోని బాంద్రాలో ఈ దాడి జరగడం సంచలనంగా మారింది.
ఆ వ్యక్తి ఏమీ దొంగిలించలేదు – బాబు దగ్గరికి దుండగుడిని రానివ్వకుండా సైఫ్ కాపాడాడు..
దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ క్రమంగా కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. ఐసీయూ నుంచి సైఫ్‌ను సాధారణ వార్డుకు తరలించామని వెల్లడించారు. అయితే తాజాగా నటుడి సతీమణి కరీనా కపూర్ స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు.
దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని ఆమె చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కానీ సైఫ్ మాత్రం కేర్‌టేకర్‌ను కాపాడి తన బిడ్డ వద్దకు దుండగుడు వెళ్లకుండా కాపాడారని అన్నారు. అయితే అతడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని పేర్కొన్నారు.
‘నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు’
“సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకుంటున్నారు. ఆయన నడుస్తున్నారు. అలాగే నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. ఆయన డిశ్చార్జ్ అయ్యాక బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించాం. ఆస్పత్రి వైద్యుల బృందం శ్రమించి సైఫ్ ను నడిచేలా చేసింది. సైఫ్‌కు చేతికి రెండు, మెడకు కుడివైపున ఒక గాయం అయ్యింది. ప్రధాన గాయం వెన్నుముక దగ్గర తగిలింది. సైఫ్ వెన్నులో చిక్కుకున్న కత్తిని తొలగించాం.” అని లీలావతి ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే తెలిపారు.
నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్
మరోవైపు, సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు ముంబయి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి సెర్చ్ అపరేషన్ నిర్వహిస్తున్నారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ఆపి దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే పోలీసు రికార్డుల్లో ఇప్పటికే పేర్లు ఉన్న వ్యక్తులను కూడా విచారణ కోసం పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు 15 మందికి పైగా వ్యక్తులను విచారణ కోసం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అలాగే సైఫ్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గురువారం రాత్రి దాడి జరిగింది. ముంబయిలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సైఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు సర్జరీ చేశారు. సైఫ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. మరోవైపు సైఫ్‌పై జరిగిన దాడి గురించి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
సైఫ్ గురించి తెలియక అలా అనేశాను, ఆయన క్షమిస్తారని అనుకుంటున్నా : ఊర్వశీ రౌతేలా
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దాడి నేపథ్యంలో నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె సైఫ్‌కు క్షమాపణలు తెలిపారు. ఇన్‌స్టాలో ఆమె పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
“సైఫ్ సర్ మీకు ఈ మెసేజ్ చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధపడుతున్నాను. ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమల్ని క్షమాపణలు కోరుతున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే టైమ్‌లో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు అంతగా తెలియదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడాను. ఇలా చేసినందుకు నేను సిగ్గు పడుతున్నాను. మీరు నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక నేను చాలా బాధపడ్డాను. ఆ టైమ్‌లో మీ ధైర్యం ఎంతో ప్రశంసనీయం. మీపై నాకు చాలా గౌరవం పెరిగింది” అని ఊర్వశీ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది.
ఇదీ జరిగింది :
సైఫ్‌పై జరిగిన దాడి గురంచి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రీటీలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఆమెను సైఫ్ ఘటనపై స్పందిచమని కోరగా, ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని, వాచీని చూపించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
“సైఫ్‌పై దాడి ఎంతో దురదృష్టకరం. నేను యాక్ట్ చేసిన ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఆ సినిమా సుమారు రూ.150కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో మా అమ్మ ఓ వజ్రపు ఉంగరాన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక మా నాన్న ఓ రోలెక్స్ వా్ను ప్రెజెంట్ చేశారు. కానీ, వీటిని నేను వేసుకుని బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా సరే మనపై అలాగే దాడి చేస్తారని భయంగా ఉంది” అని చెప్పుకొచ్చింది.
also read-ARIA HUMANOID ROBOT INTERVIEW-AI గర్ల్‌ఫ్రెండ్ ‘అరియా’ ఫ్యూచర్లో అందరికీ ఆమెనే..
‘ఇది మా ఫ్యామిలీకి బ్యాడ్ డే!’- కరీనా కపూర్…!
‘మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కాస్త సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మా పై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ, ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.