Sunrisers Hyderabad : ఉప్పల్ స్టేడియం పరుగుల సునామీతో దద్దరిల్లింది. ఆకాశమే హద్దుగా.. దొరికిన బంతిని దొరికినట్టుగా స్టాండ్స్ లోకి పంపడమే పనిగా పెట్టుకున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు.
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2024(IPL 2024)లో పరుగుల వరద పారింది. అభిమానులకు డబుల్ వినోదం అందించింది ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ (SRH vs MI). ఇరు జట్ల ఆటగాళ్లు శివతాండవం ఆడటంతో ఈ మ్యాచులో 500కు పైగా స్కోరు నమోదైంది. అయితే, చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ను విజయం వరించింది.\
ఈ మ్యాచ్ లో ముంబై టీమ్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక, ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ రికార్డు స్థాయిలో 277 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్టు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు.
అయితే, హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన విధ్వంసాన్ని బౌలర్లకు పరిచయం చేశాడు. తన క్రీజులో నిలబడితే.. అవతలి ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే అని రుజువు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు క్లాసెన్.
ఫస్ట్ మ్యాచులో సన్ రైజర్స్ ఓడినప్పటికీ క్లాసెన్ అద్భుతమైన పోరాటం కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్.. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలుపుంచుల దాకా తీసుకువెళ్లిన క్లాసెన్ ఆఖరిలో అనుహ్యంగా ఔటయ్యాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 8 సిక్స్‌లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇక, ఈ మ్యాచులో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు దిగిన క్లాసెన్ పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొని.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్పిన్, ఫాస్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే క్లాసెన్ ఇలానే చెలరిగితే.. ఆరెంజ్ ఆర్మీ కప్పు కరువు తీరుతుంది.
గత కొన్ని సీజన్ల నుంచి SRH పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఐపీఎల్ 2023లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అంతకు ముందు రెండు సీజన్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ తాజా ఎడిషన్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఈసారి జట్టును కూడా పూర్తిగా మార్చింది.
అందుకు తగ్గట్టుగానే ఈ సారి ఆరెంజ్ ఆర్మీ అదరగొడుతుంది. హెన్రిచ్ క్లాసెన్ అయితే రెండు మ్యాచుల్లోనే ఏకంగా 143 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికన్నా ముందున్నాడు. క్లాసెన్ ను ముంబై జట్టుపై బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు దింపడం మంచి నిర్ణయమని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ముందు ముందు మ్యాచుల్లో కూడా ఇదే ఫలితాలు రిపీట్ అవ్వాలంటే.. హెన్రిచ్ క్లాసెన్ ను సరైన రీతిలో వాడుకోవాలని సూచిస్తున్నారు. ఈ సారి అసలు సిసలు మ్యాచ్ విన్నర్ క్లాసెన్ అని అభిప్రాపడుతున్నారు. అతని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వస్తే పరుగుల విధ్వంసం సృష్టిస్తాడని.. ఆ తర్వాత హైదరాబాద్ కు కప్ అందిస్తాడని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
also read-
Virat Kohli:నేను అతనితో కాఫీ తాగాలనుకుంటున్నాను.. కోహ్లీ టెన్నిస్ దిగ్గజం కోసం ఎదురు చూస్తున్నాడు