Thandel Movie Review : టావీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన లేెటెస్ట్ మూవీ ‘తండేల్’. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫీల్ గుడ్ మూవీగా ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
Thandel Movie Review : సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే ‘తండేల్’. తన తండ్రి తండేల్ కావడం వల్ల చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర నుంచి ఓ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగచైతన్య). అలా పెద్దయ్యాక రాజు కూడా అందరి కష్టాల్ని వింటూ వాళ్లకోసం నిలబడటం వల్ల అందరూ అతడ్నే ‘తండేల్’గా ఎంచుకుంటారు. ఇక రాజుకి తన చిన్నప్పటి ఫ్రెండ్ సత్య (సాయిపల్లవి) అంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ తనను ప్రేమగా పిలుస్తుంటాడు.
ఇక రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు సముద్రంలో గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అంటూ ఎదురు చూస్తూ గడుపుతుంటుంది. అయితే ఈ సారి వేటకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలా సముద్రంలోకి వెళ్లాక తుపాను కల్లోలం సృష్టిస్తుంది. దీంతో పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిన రాజు పడవని, అందులోని మత్స్యకారులను అక్కడి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు సత్య రాజు కోసం ఏం చేసింది? శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం నుంచి పాకిస్థాన్ సరిహద్దుల వరకూ వెళ్లి రాజుని, ఇతర మత్స్యకారులను ఆమె విడిపించిందా? రాజు, సత్యలు కలుసుకున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
సముద్రంపైనే ఆధారపడే మత్స్యకారుల జీవితాలను, ఒక జంట మధ్య ప్రేమ, దేశభక్తి ఇలా అన్నింటినీ సమపాళ్లల్లో ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచుతుంది ఈ చిత్రం. ఇది పలు నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తిగా రూపొందిన చిత్రమన్న సంగతి తెలిసిందే. కానీ ముందు విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీకి సరిపడే కథలా అనిపించిందంటూ చైతూ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెప్పారు. అటువంటి కథకు రాజు – సత్య మధ్య ప్రేమని ముడిపెడుతూ, దానికి సినిమాటిక్ హంగులను జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ ఇద్దరి యాక్టింగ్, విజువల్స్, మ్యూజిక్ కలిసి ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
హీరో ఇంట్రడక్షన్లో ఓ ఫైట్, ఓ పాట – ఈ ఫార్ములాతోనే సినిమా మొదలవుతుంది. సముద్ర నేపథ్యం, రాజు – సత్య లవ్ స్టోరీ, ఆ ఇద్దరి మధ్య విరహం, ఒకరి కోసం మరొకరు పరితపించే సీన్స్ మెల్లగా ప్రేక్షకుడిని కథలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ‘హైలెస్సా’, ‘బుజ్జితల్లి’ పాటలతో పాటు, మధ్య మధ్యలో వచ్చే సీన్స్ కథలోని లవ్ యాంగిల్‌ను, ఎమోషన్స్‌ను పతాక స్థాయికి తీసుకెళ్తాయి. రాజు తండేల్గా ఎన్నికైన సమయంలో వచ్చే శివుడి పాట, వాటిని చిత్రీకరించిన విధానం కూడా ఫస్ట్ హాఫ్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్స్ నుంచే అసలు కథ మొదలవుతుంది. సముద్రంలో తుపానుని చూపిస్తూ తీర్చిదిద్దిన సీన్స్ కూడా బాగుంటాయి.

సెకెండాఫ్‌లో కథ పాకిస్థాన్‌కి చేరడం వల్ల లవ్ స్టోరీ కాస్త దేశ భక్తి వైపు మళ్లుతుంది. ఆ తరహా నేపథ్యం, సీన్స్‌ను కూడా ఇదివరకే పలు సినిమాల్లో చూసినప్పటికీ, దేశభక్తి అనే ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడం వల్ల ఆ ఎలిమెంట్ చాలావరకూ ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
మరోవైపు రాజు తన మాట పెడచెవిన పెట్టి వేటకి వెళ్లాడన్న కోపంతో సత్య తీసుకునే నిర్ణయాలు, ప్రేమ విషయంలో ఆమె పడే సంఘర్షణ, బందీలైన కుటుంబాలకు రావల్సిన డబ్బు కోసం గుజరాత్లో తను చేసే పోరాటం, పాకిస్థాన్ చెర నుంచి వాళ్లందరినీ విడిపించడం కోసం ఆమె దిల్లీ వెళ్లడం వంటి సీన్స్ సెకెండాఫ్‌ను ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి.
ఇక బందీల్ని విడిపించేందుకు అప్పటి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు, ఆమె కూతురు బన్సూరీ స్వరాజ్ చేసిన సాయం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలను ఇందులో చక్కగా చూపించారు. పతాక సన్నివేశాలు సినిమాటిక్‌గానే అనిపిస్తాయి. పెద్దగా ఎగ్జైట్మెంట్ తెప్పించకపోయినా, తగిన ముగింపే అనిపిస్తుంది. అయితే సెకెండాఫ్‌లో ‘ఆజాదీ’ పాటని గుజరాత్లో సత్య చేసిన పోరాటంతో మొదలుపెట్టి, పాక్ జైల్లో రాజుపై వచ్చే సీన్స్ వరకూ వాడుకున్న విధానం ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే :
నాగ చైతన్య, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ, వాళ్లు పండించిన ఎమోషన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. రాజు, సత్య పాత్రల్లో ఆ ఇద్దరూ చక్కగా ఒదిగిపోయారు. పాత్రకు తగ్గట్టుగా చైతూ మారిపోయిన విధానం, సినిమాకి మరింత నేచురాలిటీని తీసుకొచ్చింది. ఇక సాయి పల్లవి మార్క్ యాక్టింగ్, డ్యాన్స్‌కి తోడు, ఈ సినిమాలో ఆమె మరింత అందంగా కనిపించారు. ఇద్దరూ శ్రీకాకులం యాసలో పక్కాగా కాకపోయినా, బలంగా ప్రయత్నించి డైలాగ్స్ చెప్పారు. కల్పలత, కరుణాకరన్, ఆడుకాలం నరేన్, పృథ్వీరాజ్, మహేశ్ లాంటి స్ట్రార్స్ కూడా తమ పాత్రలతో మెప్పించారు.
టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ పాటల్నే వాడుకున్నారు దేవిశ్రీప్రసాద్. శ్యామ్‌దత్ సినిమాటోగ్రాఫీ సినిమాకు మరింత బలాన్నిచ్చింది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో క్వాలిటీగా ఉంది. సముద్రంలో వచ్చే సీన్స్ ఇంకా బాగుంటాయి. నిర్మాణం కూడా ఉన్నతంగా ఉంది. మాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ చందూ మొండేటి కథలోని లవ్ యాంగిల్‌పై బలమైన ప్రభావం చూపించారు. మిగతా ఎమోషన్స్న్నీ ఫర్వాలేదనిపించేలా డీల్ చేశారు. అయితే ఇటువంటి ఓ స్టోరీని సినిమాటిక్ హంగులతో మలిచిన విధానం, దానికోసం ఆయన చేసిన కసరత్తుల్ని మెచ్చుకుని తీరాల్సిందే.
- బలాలు
- + నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ
- + ప్రేమకథ, భావోద్వేగాలు
- + దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్యామ్‌దత్ విజువల్స్
- బలహీనతలు
- – నాటకీయంగా సాగే కొన్ని సన్నివేశాలు
- చివరిగా : తండేల్ – గురి తప్పలేదు
- గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తగత అభిప్రాయం మాత్రమే!
THANDEL MOVIE INTERESTING FACTS-‘తండేల్’కు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసా మరి?
Thandel Movie Interesting Facts : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ‘తండేల్’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఫిబ్రవరీ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
‘తండేల్’ అనేది గుజరాతి పదం. లీడర్ అని దాని అర్థం. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు గుజరాత్ పోర్ట్‌కి వెళ్లిన సమయంలో అనుకోకుండా పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్ అవుతారు. అయితే వారు ఆ చెర నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. స్టోరీని మరింతగా కనెక్ట్ చేసేందుకు రాజు-సత్య అనే ఫిక్షనల్ లవ్ స్టోరీని జోడించారు మేకర్స్.మత్స్యకారుల జీవన నేపథ్యంపై ఈ సినిమా తెరకెక్కడం వల్ల ఇందులో చాలా మంది వ్యక్తులను అలాగే కొంతమంది రాజకీయనాయకుల గురించి చూపించడం వల్ల సెన్సార్ సమయంలో మేకర్స్ ఇబ్బంది పడాల్సి వచ్చిందట. అంతేకాకుండా చాలా మంది దగ్గర పర్మిషన్స్ తీసుకురావాల్సి వచ్చిందట.
గతంలో ఎన్నడూలేని విధంగా డీగ్లామర్ లుక్‌లో చైతూ, సాయి పల్లవి కనిపించనున్నారు. సముద్రంలో, ఎండలో, ఇసుకలో చిత్రీకరించిన సీన్స్ కోసం ఈ ఇద్దరూ బాగా కష్టపడ్డారట. ఇక ఈ చిత్రంలో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.కేవలం సముద్రం మీదనే 30 రోజుల పాటు షూటింగ్ చేశారు. తుపాను ఎపిసోడ్ తప్ప మిగిలినవన్నీ అక్కడే చిత్రీకరించారు. మంగళూరు, కేరళ, వైజాగ్, గోవా, శ్రీకాకుళం ఇలా చాలా ఔట్‌డోర్ లొకేషన్స్‌లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. అంతేకాకుండా మంగళూరు సముద్రం దగ్గర ఓ విలేజ్ సెట్ కూడా వేశారు మేకర్స్.

ఈ సినిమాలో పాకిస్థాన్ జైలు ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. అయితే కథకు తగ్గట్టుగా ఆ సీన్స్‌ను అక్కడక్కడా అమర్చారు. ఆన్లైన్లో పాకిస్థాన్ గురించి అలాగే అక్కడి జైళ్లు ఎలా ఉంటాయనేది బాగా పరిశీలించి మరీ ఈ సినిమాను తీశారట. అంతేకాకుండా ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోనే ఓ భారీ జైలు సెట్‌ను వేశారు.
చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అయితే మొదట్లో అనుకున్న దానికంటే భారీగా ఈ సినిమా బడ్జెట్ భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 90 కోట్ల మేర పెట్టారని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయట.